నయనతార తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన `ఐరా` ఈ నెల 28న విడుదల కానుంది. గంగా ఎంటర్టైన్మెంట్స్, కేజేఆర్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన సినిమా ఇది. సర్జున్ దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదల చేయనున్నారు. ఈ సినిమా గురించి గంగా ఎంటర్టైన్మెంట్స్, కేజేఆర్ స్టూడియోస్ అధినేతలు మాట్లాడుతూ ``నయనతార ద్విపాత్రాభినయం చేసిన `ఐరా` సినిమా పోస్టర్లు ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లాయి. డీ గ్లామరస్ భవానీగా నయనతార లుక్స్ కి ప్రేక్షకుల నుంచి చాలా మంచి స్పందన వస్తోంది. పోస్టర్‌లో భవాని, యమున అనే రెండు పాత్రల రూపురేఖల మధ్య ఉన్న వేరియేషన్ కథలోనూ కనిపిస్తుంది. హారర్, థ్రిల్లర్లు ఇష్టపడేవారికి మాత్రమే కాదు, భావోద్వేగాలను ఇష్టపడే వారందరికీ ఈ సినిమా నచ్చుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మా `ఐరా` భారీగా విడుదలై వేసవిలో అందరి మన్ననలు పొందడం ఖాయం`` అని అన్నారు. దర్శకుడు సర్జున్ మాట్లాడుతూ ``ఇంద్రుడి వాహనం పేరు ఐరావతం. అందులోనుంచే మేం `ఐరా` అనే పదాన్ని ఎంపిక చేసుకున్నాం. `ఐరా` అనగానే అందరూ నయనతార పాత్ర పేరని అనుకుంటారు. ఆమె పేరు ఇందులో ఐరా కాదు. కాకపోతే పాత్ర బలాన్ని సూచించడానికి `ఐరా` అని పేరు పెట్టాం. స్క్రిప్ట్ పనులు జరిగే సమయంలో నయనతార మేడమ్ రెండు పాత్రలు చేస్తారని అనుకోలేదు. కానీ ఎందుకో ఒకసారి ఆ ఆలోచన తట్టింది. వెంటనే ఆమెను సంప్రతించి విషయాన్ని వివరించాం. `లుక్ టెస్ట్ చేసిన తర్వాత డిసైడ్ చేద్దాం. ఇప్పుడే ఏమీ చెప్పలేను` అని ఆమె అన్నారు. ఆ మాట ప్రకారం లుక్ టెస్ట్ చేశాం. ఇక మేం భవాని పాత్ర కోసం ఇంకెవరినీ సంప్రతించాల్సిన అవసరం లేదని అర్థమైంది. మా భవాని, యమున పాత్రలను ఒక్కరే చేయబోతున్నారని అందరం సంతోషించాం. ఇది సూపర్ నేచురల్ థ్రిల్లర్ అయినప్పటికీ, రెగ్యులర్ హారర్ జోనర్లలో కనిపించే వినోదాన్ని మించి ఇంకా ఏదో చేయాలని ప్రయత్నించాం. సినిమా చూసి ఇంటికెళ్లే ప్రేక్షకులు తప్పకుండా ఇందులోని అంశాలను పదిలంగా మోసుకెళ్తారు. సాంకేతికంగానూ ఎక్కడా రాజీపడకుండా తెరకెక్కించాం. సౌండ్ డిజైనింగ్ హైలైట్ అవుతుంది. హారర్ చిత్రాల్లో సౌండ్ కు విపరీతమైన ప్రాధాన్యం ఉంటుందని అందరూ అనుకుంటారు. అయితే చాలా సందర్భాల్లో సైలెన్స్ కూడా చాలా ఎక్కువ విషయాలను చెప్పగలుగుతుంది. అందుకే వాటి రెండింటిని కలిపి ఇందులో మేం చేసిన ప్రయత్నానికి తప్పకుండా మెప్పు లభిస్తుందని ఆశిస్తున్నాం. తొలి సగం ఎంత ఉత్కంఠగా సాగుతుందో, రెండు సగం అంతకు మించి ఉంటుంది. పర్ఫెక్ట్ స్క్రీన్‌ప్లేకి నిదర్శనం ఈ సినిమా`` అని అన్నారు.